: గోవిందుడు అందరి వాడేలే...!
భారతదేశంలో శ్రీవారిని స్మరించడం, ఆలయాలను నిర్మించడం పరిపాటే. కాని, అమెరికాలోనూ... అందునా అమెరికన్లు శ్రీనివాసుని ఆలయం నిర్మించడం విశేషమే. అమెరికాలోని ఆస్టిన్ లో షిర్డీ సాయి మందిరాన్ని నిర్మించిన క్రెగ్, జిల్ దంపతులు వేంకటేశ్వరాలయాన్ని నిర్మించారు. ఎనిమిది వేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఈ నెల 18 నుంచి 22 వరకు మహాకుంభాభిషేకం వైభవోపేతంగా జరిగింది. ఆగమశాస్త్ర నియమానుసారం శ్రీ వేంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీనివాసునితో పాటు ఆంజనేయ సమేత సీతారామలక్ష్మణులు, రాధాకృష్ణ, శివుడు తదితర దేవతామూర్తుల విగ్రహాలను ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. అర్చకులు సామవేదం చంద్రశేఖరశర్మ ఈ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పర్యవేక్షించారు.