: ఈ పాపం వారిదే... గెయిల్ ప్రమాదంపై మండిపడుతున్న స్థానికులు
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాసు పైప్ లైన్ ప్రమాదంపై స్థానికులు మండిపడుతున్నారు. గ్యాస్ పైప్ లైన్ నుంచి చాలాకాలంగా లీకులు వస్తున్నాయని, ఆ విషయం గెయిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఒత్తిడి చేస్తే మరమ్మత్తులు చేసి వెళ్లిపోతున్నారే తప్ప పైప్ లైన్ మార్చలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఉదయం 5:30 నిమిషాలకు ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డీఎస్పీ స్పందించారని, ఆయన హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారని, తమ కళ్లెదుటే చాలా మంది మృత్యువుతో పోరాడుతుంటే నిస్సహాయులమై చూస్తూ ఉండిపోయామని దగ్ధమైన స్వరాలతో చెప్పారు.