: బ్రెడ్ ప్యాకెట్లో కోడిపిల్ల తల!
టీ కప్పులో ఈగలు, మసాలా దోసెలో బొద్దింకలు ఇప్పటివరకు మనం చూశాం! తాజాగా, బ్రెడ్ ప్యాకెట్లో కోడిపిల్ల తల కనిపించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని షేక్ పురాలో చోటు చేసుకుంది. అజయ్ అనే వ్యక్తి స్థానిక గోవర్ధన్ రోడ్డులోని ఓ షాపుకెళ్ళి బ్రెడ్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. బ్రేక్ ఫాస్ట్ చేద్దామని దాన్ని విప్పగా, అందులో కోడిపిల్ల తల బయటపడింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ వెంటనే బంధుమిత్రులను వెంటేసుకుని సదరు దుకాణం ముందు ధూమ్ ధామ్ చేశాడు.
పనిలోపనిగా దుకాణదారుపై వర్తక సంఘం అధ్యక్షుడు అతుల్ గుప్తాకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం ఫుడ్ సెక్యూరిటీ అధికారి మంజు రాణికి తెలియడంతో ఆమె దుకాణం వద్దకు చేరుకున్నారు. దుకాణదారును ప్రశ్నించగా, ప్యాక్ చేసిన బ్రెడ్డులో కోడిపిల్ల తల ఎలా వచ్చిందో తనకు తెలియదని సమాధానమిచ్చాడు. ఈ ఘటనలో బ్రెడ్ తయారీదారుపై కేసు నమోదు చేస్తామని జిల్లా చీఫ్ ఫుడ్ సెక్యూరిటీ అధికారి తెలిపారు.