: భూమి సైజులో 'వజ్రం'!
అమెరికా ఖగోళ శాస్త్రవేత్తల బృందం రోదసిలో అద్భుతాన్ని కనుగొంది. భూమి సైజులో ధవళకాంతులతో ధగధగలాడుతున్న సరికొత్త నక్షత్రాన్ని గుర్తించారు. అత్యంత చల్లగా ఉండే ఈ నక్షత్రం కార్బన్ స్ఫటిక రూపంలో ఘనీభవించడం ద్వారా ఏర్పడిందని విస్కాన్సిన్-మిల్వాకీ యూనివర్శిటీ ప్రొఫెసర్ డేవిడ్ కాప్లాన్ తెలిపారు. ఇది పాలపుంతకు సమవయస్కురాలని, 11 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు.
ఇలాంటి నక్షత్రాలు ఎన్నో ఉంటాయని, అయితే అవి కాంతివిహీనంగా ఉండడంతో గుర్తించలేమని కాప్లాన్ వివరించారు. అయితే, తాము కనుగొన్న నక్షత్రం భూమి పరిమాణంలో వజ్రంలా మెరిసిపోతోందని పేర్కొన్నారు. కార్బన్, ఆక్సిజన్ లతో ఈ నక్షత్రాలు ఉద్భవిస్తాయని, క్రమేణా చల్లబడుతూ మసకబారిపోతాయని కాప్లాన్ తెలిపారు. కాప్లాన్ బృందం భారీ టెలిస్కోప్ ల సాయంతో ఈ మెరుపు తారను కనుగొంది.