: కండోమ్ వాడకంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు... ఖండించిన ఆమ్ ఆద్మీ


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎయిడ్స్ పై ప్రచారంలో కండోమ్ వాడండి అంటూ పేర్కొంటున్నారని, తద్వారా అక్రమసంబంధాలను ప్రోత్సహించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కండోమ్ వాడకం లేకుంటేనే ఎయిడ్స్ భయంతో ప్రజలు కట్టుతప్పకుండా ఉంటారన్నది మంత్రి వ్యాఖ్యల సారాంశం. 'కండోమ్ వాడండి, ఎయిడ్స్ ను పారద్రోలండి' అన్న నినాదంలో తప్పుడు సందేశం దాగి ఉందని అన్నారు. కండోమ్స్ వాడుతున్నంత కాలం ఎన్ని అక్రమ సంబంధాలైనా నెరపవచ్చని దానర్థం అని మంత్రి వివరించారు.

కండోమ్ ప్రచారానికి బదులుగా భార్యాభర్తల అనుబంధంపై ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాంపత్య జీవితమనేది భారత సంస్కృతిలో భాగమని తెలిపారు. అయితే, మంత్రి వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ నేత అశుతోష్ ఖండించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఇంకా ఎదగాలని హితవు పలికారు. ఆధునికంగా ఆలోచించడం నేర్చుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. అశుతోష్ 2014 ఎన్నికల్లో డాక్టర్ హర్షవర్ధన్ చేతిలో పరాజయం చవిచూడడం గమనార్హం.

  • Loading...

More Telugu News