: గద్దర్.. 'నంది'కి తలవంచేనా.. !?


'పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా' అంటూ తెలంగాణ తీరు తెన్నులను అద్భుతంగా గేయీకరించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ రేపటి నంది అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యే విషయంలో అనిశ్చితి నెలకొంది. తెలంగాణ ఇతివృత్తంగా నిర్మితమైన 'జై బోలో తెలంగాణ' చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా గద్దర్ కు నంది అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్. శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. 2011కి గాను నంది అవార్డులను రేపు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, ఈ కార్యక్రమానికి కొందరు గద్దర్ హాజరవుతాడని, కొందరు హాజరుకాడని.. ఇలా సాగుతున్నాయి ఊహాగానాలు. గతంలో నక్సల్ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన గద్దర్ ప్రభుత్వానికి ఎప్పుడైనా వర్గ శత్రువేనన్న సంగతి మరువరాదు. నక్సలిజం నుంచి తెలంగాణ సాధన వరకు గద్దర్ ది పోరుబాటే. పలు సందర్భాల్లో సర్కారును ఇరకాటంలో పెట్టిన ఘనత గద్దర్ ది.

ఈ నేపథ్యంలో ఉగాది నాడు ఇచ్చే 'నంది అవార్డు'ను ఆయన స్వీకరిస్తాడా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే పురస్కారాన్ని స్వీకరిస్తే వారి విధానాలను అంగీకరించినట్టే అన్న భావన గద్దర్ లో పొడసూపితే మాత్రం ఈ ప్రజా గాయకుడి ఆటపాట అవార్డుల వేదికపై కనిపించకపోవచ్చు. అయితే, ఈ అవార్డులు ప్రజలు అందించేవిగా పరిగణించి స్వీకరించాలని పలువురు విజ్ఞులు ఆయనకు సూచించినట్టు సమాచారం.

ఇక ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల పండుగకు హైదరాబాద్ లోని లలిత కళాతోరణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రేపు సాయంత్రం ఆరు గంటలకు 'నంది' బహుకరణ షురూ అవుతుంది. ఈ ప్రదానోత్సవానికి సీఎం కిరణ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డీకే అరుణ, సినీ ప్రముఖులు హాజరవుతారు.

  • Loading...

More Telugu News