: విభజన సందర్భంగా నిద్రలేని రాత్రులు గడిపాను: బాబు
అధికారంలో ఉండగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో సమైక్యరాష్ట్రం అని పేర్కొని ఎన్నికల్లోకి వెళ్లి ఓటమి పాలయ్యామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నానని అన్నారు. విభజన కారణంగా నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన వెల్లడించారు. నిద్రపోకుండా గంటల కొద్దీ మేధావులతో చర్చలు జరిపానని ఆయన వెల్లడించారు.
అప్పుడు 'నీకేం కావాలో చెప్పు' అంటూ కాంగ్రెస్ పార్టీ తనను వ్యక్తిగతంగా మాట్లాడి అవమానపరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా దక్కకుండా నాశనమైపోయిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో చెప్పిందే తెలంగాణలోనూ చెప్పామని ఆయన అన్నారు.
9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆదరించిన తనను 'ప్రజల్లో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ అని?' అని మీడియా వారు, తెలంగాణ ప్రతినిధులు పదేపదే ప్రశ్నించారని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ తెలుగు వారికి అన్యాయం జరిగినా టీడీపీ స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లని ఆయని తెలిపారు.
టీడీపీ ఆవిర్భావమే తెలుగు ప్రజలను ఏకం చేసేందుకని, విభజించేందుకు కాదని ఆయన తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని కట్టాలంటే నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాలు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ పై యాభై ఏళ్లపాటు ఖర్చు పెడితే ఇప్పుడున్న నగరం తయారైందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని వనరులు ఉన్నాయి... కానీ అభివృద్ధి సాధించాలంటే విజన్ ఉండాలని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు.