: తిరుమలలో నీటికి కటకట
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు క్రమేణా అడుగంటుతున్నాయి. తిరుమలకు రోజుకు 55 వేల నుంచి 70 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరందరి అవసరాలు తీరాలంటే రోజుకు 24 లక్షల గాలన్ల నుంచి 40 లక్షల గాలన్ల నీరు అవసరమవుతుంది. ప్రధానంగా తిరుమలకు గోగర్భం, పాపవినాశనం, కుమారధార-పసుపుధార ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా జరుగుతుంది. వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం వీటిలో నీటిమట్టం బాగా తగ్గిపోయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే భక్తుల నుంచి తీవ్ర నిరసన తప్పదని టీటీడీ భావిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నుంచి తిరుమలకు నీటి సరఫరా జరుగుతోంది.