: ప్రేమజంటకు పెళ్ళి చేసిన ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఓ ప్రేమజంట ఒక్కటయ్యేందుకు సహకరించి తన పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా మార్లమూడి వాసి రాజేశ్, అనంతపూడి గ్రామానికి చెందిన రాణి గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకుని పెంటపాడులోని బాలవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళారు. అయితే, పెళ్ళికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అక్కడి అధికారులు వారి వివాహానికి అంగీకరించలేదు. తర్వాతి రోజు అన్ని సర్టిఫికెట్లు తీసుకెళ్ళినా ఆలయ ఈవో సమ్మతించలేదు.
తాము దళితులమన్న కారణంతోనే అధికారులు అడ్డుచెబుతున్నారని రాజేశ్, రాణి తాడేపల్లి గూడెం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం మంత్రి మాణిక్యాలరావుకు తెలిసింది. దీంతో, ఆయన రంగప్రవేశం చేసి వెంటనే వారిద్దరికీ అదే ఆలయంలో పెళ్ళి జరిపించి, దీవించారు. మంత్రి చొరవ పట్ల ప్రేమజంట హర్షం వ్యక్తం చేసింది.