: ఈ విషయంలోనూ ఢిల్లీ టాప్
దేశ రాజధాని క్రైమ్ పరంగానే కాదు, రోడ్డు ప్రమాదాల రీత్యా కూడా దేశంలో అగ్రస్థానం దక్కించుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఢిల్లీ రహదారులు నెత్తురోడుతున్నా ప్రభుత్వ చర్యలు స్వల్పం. 2008 నుంచి 2013 వరకు ఇక్కడ జరిగిన యాక్సిడెంట్లలో 12,300 మంది అసువులు బాశారు. ఒక్క 2013లోనే 1820 మంది మృత్యువాత పడ్డారంటేనే అర్థమవుతోంది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) ఈ గణాంకాలను వెల్లడించింది.
దేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన రహదారులు ఢిల్లీలోనే ఉన్నాయని సీఎస్ఈ తెలిపింది. సగటున రోజుకు ఐదుగురు మరణిస్తుండగా, వారిలో నలుగురు పాదచారులు కానీ, ద్విచక్రవాహనదారులు కానీ ఉంటున్నారు. కాగా, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం 128 డేంజర్ జోన్లను గుర్తించింది. ఈ హాట్ స్పాట్లలో ప్రమాదకర రోడ్డు ప్రమాదాలు జరిగాయని సీఎస్ఈ నివేదిక చెబుతోంది.