: సబితమ్మ సీట్లోకి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు?
రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పదవీగండం తప్పినా.. శాఖ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో సబితను సీబీఐ ఎ4 నిందితురాలిగా ఛార్జిషీటులో పేర్కొన్న నేపథ్యంలో కిరణ్ సర్కారుపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో, నష్టనివారణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నడుం బిగించినట్టు తెలుస్తోంది. సబిత రాజీనామా చేస్తే ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, పదవిలో కొనసాగితే విపక్షాల చేతికి ఆయుధాలిచ్చినట్టవుతుందని భావిస్తోన్న సీఎం.. మధ్యేమార్గంగా శాఖ మార్పుకే ఓటేసే అవకాశాలున్నాయి.
అయితే, హోం మంత్రి పదవి కచ్చితంగా తెలంగాణ వ్యక్తికే కేటాయించాల్సి రావడంతో ఆ ప్రాంతానికి చెందిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేరు తెరపైకి వచ్చింది. శ్రీధర్ బాబు యువకుడు, విద్యాధికుడు, చురుకైన వ్యక్తే కాకుండా, సీఎంకు అత్యంత సన్నిహితుడు కావడం కలిసొచ్చే అంశం. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీధర్ బాబుకే హోం మంత్రి చాన్సు దక్కనుందని రాజకీయ వర్గాల విశ్లేషణ.
కానీ, తెలంగాణ ప్రాంతానికే చెందిన మరో సీనియర్ మంత్రి జానారెడ్డి సైతం హోం శాఖను ఆశిస్తున్నారట. గతంలో ఈ కీలక శాఖను చేపట్టిన అనుభవం ఉన్నా.. ముఖ్యమంత్రితో పొసగకపోవడం ఆయనకు ప్రతికూలం కానుంది. తనను వ్యతిరేకించే వారికంటే, చెప్పినట్టు నడుచుకునే శ్రీధర్ బాబు వంటివారికే హోం శాఖను అప్పగించాలన్నది సీఎం యోచనగా తెలుస్తోంది.