: వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి: రాధామోహన్ సింగ్
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం చేసేందుకు భూములు మంచివని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన భృతి, ఆదాయవనరు వ్యవసాయమని ఆయన తెలిపారు. వ్యవసాయానికి ఆదరణ లేకపోవడంతో ఏటికేడు ఉత్పత్తి తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని వ్యవసాయం చేసే ప్రతి ఎకరాకి నీరు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆయనతో భేటీ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరులో అగ్రికల్చరల్ యూనివర్సిటీ నెలకొల్పాలని కోరారు. రాయలసీమలోని భూములకు సాగునీరు అందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ కు 500 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్రమంత్రికి సూచించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.