: మోడీని కలిసిన అమీర్ ఖాన్
ప్రధాని నరేంద్రమోడీని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కలిశారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత మోడీని కలిసిన బాలీవుడ్ తొలి హీరో అమీర్ ఖాన్ కావడం విశేషం. ప్రధానిని అమీర్ మర్యాదపూర్వకంగా కలిశారని పీఎంవో పెర్కొంది. కాగా, అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమం దేశంలోని సమస్యలను ఎత్తి చూపడంలో సఫలమైంది. దాంతో ఆయా ప్రభుత్వ విభాగాల్లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యమేర్పడింది. మోడీని బాలీవుడ్ నటులు కలుస్తున్నా, మద్దతు పలికినా అమీర్ ఖాన్ ఆయనపై ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు.
కాగా, ప్రధాని మోడీకి బాలీవుడ్ నటులంటే కాస్త అభిమానమే. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాష్ట్రానికి కొన్నేళ్లుగా అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే, ఎన్నికలకు ముందు సంక్రాంతి సందర్భంగా సల్మాన్ ఖాన్ తో పతంగులు ఎగురేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధానిని కలిసినట్టు పీఎంవో తెలిపింది. ఆ ఫోటోలను కూడా పీఎంవో ట్విట్టర్లో పెట్టింది. వారి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియలేదు.