: రాజధాని అంటే అసెంబ్లీ కట్టడం కాదు: జగన్


రాజధాని అంటే అసెంబ్లీనో, ఇతర ప్రభుత్వ భవనాలనో నిర్మించడం మాత్రమే కాదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ సూచించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాజధాని అంటే మౌలిక వసతులు సమకూర్చడమని అన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత ప్రతి గ్రామంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ లా తయారు చేస్తానని అన్నారని గుర్తు చేశారు.

రాజధాని అంటే కేంద్రానికి నాలుగు వైపులా సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ఉండేలా పట్టణాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. అలా నిర్మించాలంటే సుమారు 25 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. అంత భూమి ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో అందుబాటులో ఉందో తనకు తెలియదని ఆయన వెల్లడించారు. అన్ని రకాల మౌలిక వసతులు రాజధానిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికార పక్షానికి సూచించారు.

సింగపూర్ ని నిర్మించకపోయినా పర్వాలేదు కానీ, అన్ని సౌకర్యాలు ఉన్న రాజధానిని నిర్మించి ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారని జగన్ అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. జగన్ ఇంకా మాట్లాడాలనుకునేలోపే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News