: జాబేది బాబూ... నిరుద్యోగ భృతి రూ.2000 సంగతేంటి?: జగన్
'బాబు వస్తాడు, జాబు వస్తుంద'ని ప్రజలు టీడీపీకి ఓట్లేశారని, 'బాబు వచ్చాడు మరి జాబులేవి?' అని ప్రతిపక్షనేత జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, "ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది" అని ఆయన విమర్శించారు. హామీల అమలు సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారని ఆయన ఆరోపించారు.
24 వేల మంది ఆదర్శ రైతులను టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు అధికారంలోకి వస్తాడనీ, కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతుందని ప్రజలంతా ఆశపడ్డారని, అయితే బాబు రావడం అయితే వచ్చాడు కానీ, ఉచిత విద్య అందడం లేదని ఆయన విమర్శించారు. స్కూళ్లకు వెళ్తే అక్కడ చొక్కా పట్టుకుని ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అధికార పక్షం దానిమీద దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.