: ఆ మొసలి ప్యూర్ వెజ్... పూజారులు పెడితేనే తింటుంది
ఆ మొసలి ప్యూర్ వెజిటేరియన్... 60 ఏళ్లుగా కేవలం పరమాన్నమే తింటోంది... అది కూడా ఎవరుపడితే వారు పెడితే తినదు...కేవలం గుడి పూజారులే పెట్టాలి. కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని అనంతపుర చెరువులో ఉన్న అనంతపద్మనాభస్వామికి మొసలి సంరక్షకుడు. ఆ చెరువులోనే ఉంటూ స్వామివారికి రక్షణ కల్పిస్తూ ఉంటుందని భక్తుల నమ్మకం. దానిని బాబియా అని పిలుస్తూ ఉంటారు.
ఈ మొసలి చేపలను కూడా తినదు. ఇంత వరకు ఎవరికీ అపకారం కూడా చేయలేదు. దీంతో ఆ మొసలిని అందరూ దైవాంశసంభూతమైనదిగా భావించి పూజిస్తారు. అసలు తొమ్మిదో శతాబ్ధం నాటి ఈ గుడి చెరువులోకి మొసలి ఎలా వచ్చిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకోవిషయం ఏమిటంటే, ఈ చెరువులో ఒక్క మొసలి మాత్రమే ఉంటుంది. ఒక మొసలి చనిపోతే తప్ప ఇంకో మొసలి ఈ చెరువులోకి రాదు.
బిల్వమంగళుడనే భక్తుడు శ్రీమహావిష్ణువును పూజించేవాడట. ఆయనను పరీక్షించేందుకు విష్ణువు అల్లరిపిల్లవాడి రూపంలో వచ్చి అల్లరి చేయడం ప్రారంభించాడట. పిల్లాడి అల్లరిని భరించలేకపోయిన బిల్వమంగళుడు ఈ పిల్లాడి చెవి మెలేసి దూరంగా పొమ్మని ఆదేశించాడట. దీంతో విష్ణువు పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి అంతర్ధానమైపోయాడట. ఆ గుహకు మొసలి కాపలాగా ఉండేదట. అదే ఈ మొసలి అని భక్తులు భావిస్తున్నారు.