: పోలవరంపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదు: పల్లె
పోలవరం ముంపు గ్రామాలపై మాట్లాడే నైతిక హక్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు గురించి తెలియకుండానే కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరకు కృతజ్ఞతలు చెప్పేందుకు కుటుంబసమేతంగా వెళ్లారా? అని ప్రశ్నించారు. ఏదో ఒక రాద్ధాంతం చేద్దామనే కుటిలబుద్ధితో కాకపోతే, వారికి అభ్యంతరం ఎందుకు? అని ఆయన నిలదీశారు. పోలవరంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేయడం అర్ధరహితమని అన్నారు.
ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేసిన విషయం వీరు తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. పోలవరంపై రాద్ధాంతం మాని, నిర్వాసితులకు న్యాయం చేసే విషయం గురించి కేసీఆర్ మాట్లాడాలని ఆయన సూచించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దును వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉసురు తెలంగాణ ప్రజలకు తగులుతుందని పల్లె తెలిపారు.