: చెర్రీస్ తో నో వర్రీస్!
చెర్రీలు... ఎర్రెర్రగా నోరూరించే ఈ ఫలాలు రుచిలోనే కాదు, ఔషధ గుణాల రీత్యా మధురమైనవే. వీటిలో యాంటీ ఆక్సిడాంట్లు, విశిష్టమైన విటమిన్లు, వివిధరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంతోసియానిన్స్ అనే యాంటీ ఆక్సిడాంట్ క్యాన్సర్ నిరోధకంగానూ, వైరస్ సంహారిగానూ భేషుగ్గా పనిచేస్తుందట. ముదురు రంగులో ఉండే చెర్రీ ఫ్రూట్స్ లో ఈ ఆంతోసియానిన్స్ పదార్థం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులంటున్నారు.
జీర్ణక్రియకు ఎంతో అవసరమైన పీచు పదార్థం కూడా ఈ బుల్లి ఫలాలు మనకందిస్తాయి. 10 చెర్రీలు తింటే 1.4 గ్రాముల పీచు పదార్థం శరీరానికి అందుతుంది. ఇక, మన గుండెకు అత్యావశ్యకమైన పోషకం పొటాషియం. ఇది హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. రక్తపోటును క్రమబద్ధీకరించడం, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పొటాషియందే. చెర్రీల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది.
శరీర ఎదుగుదలకు విటమిన్లెంతో అవసరం. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె సమృద్ధిగా లభిస్తాయి. డైటింగ్ చేయాలనుకునే వారికి చెర్రీలు ఎంతో ఉపయుక్తమైనవి. ఒక చెర్రీ తింటే నాలుగు కెలోరీలు మాత్రమే శక్తి వస్తుంది. చెర్రీలు తింటే నిద్రలేమి కూడా దూరమవుతుందట. మరెందుకాలస్యం, చెర్రీలను లాగించేయండి!