: కాసేపట్లో పెళ్లి... పోలీస్ స్టేషన్లో పెళ్లి కొడుకు!
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి కొడుకు హైదరాబాద్ లోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో పోలీసుల 'మర్యాదలు' పొందుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే, టోలీచౌకీకి చెందిన మహ్మద్ సలీముద్దీన్ (32) సౌదీ అరేబియాలోని జెడ్డాలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అతడికి ఫలక్ నుమాలోని జానుమా ప్రాంతానికి చెందిన యువతితో నెల రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. దీంతో 5 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం, వంద గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో నెల క్రితం వీరి పెళ్లి నిశ్చితార్ధం జరిగింది.
ఈ రోజు (శనివారం) రాత్రికి ఫలక్ నుమాలోని బసేరా ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరగాల్సి ఉండగా, దుబాయ్ నుంచి వచ్చిన సలీముద్దీన్ తనకు 10 లక్షల రూపాయల కట్నం, కారు, పది తులాల బంగారం, 200 గజాల ఇంటి స్థలం కావాలని డిమాండ్ చేశాడు. అలా ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో వధువు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలక్ నుమా పోలీసులు వరకట్నం, వేధింపులు కింద కేసులు నమోదు చేసి, సలీముద్దీన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.