: జేఎస్ సీఏ స్టేడియం రాంచీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది: ధోనీ
జార్ఖండ్ లోని జేఎస్ సీఏ స్టేడియం రాంచీ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఇక్కడ స్టేడియం నిర్మించిన తర్వాతే రాంచీని క్రికెట్ ప్రేమికులు సులువుగా గుర్తించగలుగుతున్నారని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇంతకుముందు వరకు రాంచీ అంటే కరాచీ అని కొందరు పొరబడేవాళ్ళని ఈ జార్ఖండ్ డైనమైట్ నవ్వుతూ చెప్పాడు. అందుకు ఉదాహరణగా, ఓ సంఘటన గుర్తు చేశాడు. కెరీర్ తొలినాళ్ళలో తన స్వస్థలం గురించి ప్రశ్నించేవారని, తాను రాంచీ అని చెప్పేవాణ్ణని ధోనీ తెలిపాడు. అందుకు వాళ్ళు బదులుగా, 'మీ అమ్మా నాన్నా దేశవిభజన అనంతరం భారత్ కు వచ్చేయాల్సింది' అనేవాళ్ళు. వాళ్ళు రాంచీని పాకిస్థాన్ లోని కరాచీగా పొరబడుతున్నారని అర్థమై వెంటనే సర్దిచెప్పేవాణ్ణని ధోనీ వివరించాడు.
ఇక, జేఎస్ సీఏ స్టేడియం గురించి మాట్లాడుతూ, రాంచీలో నిర్మితమైన ఈ స్టేడియం దేశంలోని అత్యున్నత మైదానాల్లో ఒకటి అని అభివర్ణించాడు.