: 'ఆటోనగర్ సూర్య' సినిమా విడుదల ఆపండి!
యువహీరో నాగచైతన్య నటించిన 'ఆటోనగర్ సూర్య' సినిమాకు అడ్డంకులు వీడలేదు. ఈ నెల 27న సినిమా విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ దశలో జూలై 10వ తేదీ వరకు సినిమా విడుదలను వాయిదా వేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.
'ఆటోనగర్ సూర్య' సినిమా నిర్మాణం ప్రారంభించినప్పట్నుంచి ఏదో ఒక వివాదం వెంటాడుతూ వచ్చింది. తాజాగా గుంటూరుకు చెందిన ఎంరాల్ ప్రాజెక్టు యజమాని మహ్మద్ 'ఆటోనగర్ సూర్య' సినిమాకు అడ్డంకిగా మారారు. చిత్ర నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్న నిర్మాతలు, అప్పు తీర్చకపోగా, పంపిణీ హక్కులు కూడా ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు. దీంతో సినిమా విడుదలను వాయిదా వేయాలని గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత జోడీగా నటిస్తుండగా, 'ప్రస్థానం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.