: సేమ్ టు సేమ్... యూపీఏ బాటలోనే బీజేపీ నడుస్తోంది: కరుణానిధి
కేంద్రం తీసుకున్న రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మండిపడ్డారు. యూపీఏ తప్పిదాలను సరిదిద్దుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, తాను సైతం అవే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రంలో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో మార్పేమీలేదని కరుణ వ్యాఖ్యానించారు. శ్రీలంక అధినాయకత్వంతో సాన్నిహిత్యం, డీజిల్ ధరల పెంపు వంటి నిర్ణయాలకు తోడు రైలు ఛార్జీల పెంపు నిర్ణయం కూడా బీజేపీ దృక్పథాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.
రైలు ప్రయాణ ఛార్జీలు 14.2 శాతం మేర పెంచుతూ తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలపై పెను ప్రభావం చూపుతుందని కరుణానిధి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని, లేకుంటే, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడిపై పెనుభారం పడే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. ఇక, ఎండీఎంకే నేత విజయకాంత్ స్పందిస్తూ, కేంద్రానివి తప్పుడు ఆర్థిక విధానాలని దుయ్యబట్టారు.