: జీన్స్ ను బట్టే చురుకుదనం, అలవాట్లు
మనిషి ప్రయత్నంతో ఎలాంటి అలవాట్లయినా మార్చేసుకోవచ్చునని మనం నమ్ముతాం గానీ.. నిజానికి చురుకుదనం, బద్ధకానికి సంబంధించిన కొన్ని రకాల అలవాట్లకు ప్రధానంగా వారి జన్యువుల్లో ఉండే ఏర్పాటు కారణమని శాస్త్రవేత్తలు తేలుస్తున్నారు. మిసౌరీ యూనివర్సిటీ వారు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం తేలింది.
తమాషా ఏంటంటే.. బాగా చురుకుదనం ఉన్న ఎలుకల మధ్య సంపర్కంతో పుట్టే బుల్లి ఎలుకల్లో చురుకుదనం ఎక్కువగ ఉంటోందిట. ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి శాస్త్రవేత్తలు.. ఎలుకలను గమనించి.. వాటి చురుకుదనాన్ని అంచనా వేసి పది తరాల పాటు వాటి మధ్య సంపర్కం కల్పిస్తూ.. పిల్లల జెనరేషన్‌లను తయారుచేస్తూ.. గమనిస్తూ వెళ్లారు. పదోతరంలో చురుకుదనం బాగా పెరిగిందిట. మిగిలిన బద్దకపు ఎలుకలతో వీటిని పోల్చి చూసినప్పుడు.. జన్యుభేదాలు బాగా కనిపించాయిట. దీంతో చురుకుదనానికి జన్యుసంబంధం ఉందని తేల్చారు. స్థూలకాయం బెడద తప్పించుకోవడానికి జన్యువుల్లో బద్ధకాన్ని ముందే గుర్తించడం వంటి పరిశోధనలు ఉపయోగపడవచ్చని అంటున్నారు.