: పిలిచిన వెంటనే భార్య రాలేదని...!
అతడో ప్రొఫెసర్. పేరు సునీల్ దొడ్డణ్ణయ్య. బెంగళూరు లాల్ బహదూర్ శాస్త్రి నగర్లో నివాసం. కేఆర్ పురంలోని ఈస్ట్ వెస్ట్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్న ఈ ప్రొఫెసర్ కు ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులూ ఈయన వద్దే ఉంటున్నారు. నిన్న రాత్రి భోజనాల సమయంలో... భోజనానికి రమ్మని భార్యను పిలిచాడు. ఆమె పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో మనస్థాపం చెందిన సునీల్ కఠోర నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తన రూంలో తలుపు లాక్ చేసుకున్నాడు.
కుమారుడికి కోపం వస్తే గదిలోకెళ్ళి తలుపేసుకోవడం అలవాటని తెలిసిన సునీల్ తండ్రి దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. కోపం తగ్గిన తర్వాత అతడే తలుపు తీస్తాడని కుటుంబ సభ్యులందరూ మిన్నకుండిపోయారు. తెల్లవారినా సునీల్ బయటికిరాకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచి చూసిన వారు షాక్ కు గురయ్యారు. సునీల్ శవం సీలింగ్ కు వేళ్ళాడుతూ కనిపించింది. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకున్నారు. ఆ గదిలో సూసైడ్ నోట్ ఏమీ లభ్యంకాలేదని పోలీసులు తెలిపారు.