: ఇక సిగరెట్ ప్యాకెట్ ప్రియం... వడ్డింపుకు కేంద్రం రెడీ!
దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరిగిపోతున్న సిగరెట్ల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ చక్కని ఉపాయం ఆలోచించింది. దీంతో ఈసారి బడ్జెట్లో సిగరెట్ల మీద పన్నులు భారీగా వడ్డించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. గతంలోలా సిగరెట్ల పొడవుతో సంబంధం లేకుండా, ఒక్కో సిగరెట్ మీద కనీసం 3.50 రూపాయల చొప్పున పెంచాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. బీడీల మీద ఇంతకాలం ఉన్న పన్ను మినహాయింపును రద్దు చేయాలని స్పష్టం చేసింది.
రోజుకు 20 లక్షల కంటే తక్కువ బీడీలు ఉత్పత్తి చేసేవారికి ఉండే పన్ను మినహాయింపును ఉపసంహరించాలని ఆర్థిక శాఖకు సూచించింది. పన్ను ఎగవేయకుండా పటిష్ఠంగా చట్టం చేయాలని, పన్ను ఎగవేత దారులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖను కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచి ఆగస్టు 25 వరకు జరుగనున్న నేపథ్యంలో వివిధ శాఖల నుంచి ఆర్ధిక శాఖకు సలహాలు, సూచనలు అందుతున్నాయి. కాగా, కేంద్ర ఆర్థిక శాఖ జూలై 11న బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.