: ఈ స్ప్రే కొట్టండి... బంధం బలపడకపోతే చెప్పండి!
ఒక్క స్ప్రే బంధాలను బలోపేతం చేస్తుందని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. మానవ సంబంధాలను పటిష్ఠపరచడం, బలహీనంగా మార్చడంలో హార్మోన్ల ప్రభావం కీలకం. దీనిపై జపాన్ లోని టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా పిట్యూటరీ గ్రంధి నుంచి ఆక్సిటోసిన్ లేదా లవ్ హార్మోన్ విడుదలవుతుంది. దీనిని స్ప్రేగా రూపొందించి, ప్రయోగిస్తే ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధించారు.
ఫలితంగా వారు ఓ స్ప్రేను తయారు చేశారు. ఈ స్ప్రేను 16 జాతుల పెంపుడు కుక్కలపై ప్రయోగించారు. స్ప్రే చేయని శునకాలతో పోలిస్తే...స్ప్రే చేసిన శునకాలు వాటి యజమానులతో ఎలా వ్యవహరిస్తున్నాయనే అంశాన్ని పరిశీలించారు. ఆక్సిటోసిన్ స్ప్రే విడుదలైన కుక్కల్లో ఎక్కడ లేని మార్పు కనిపించిందట. యజమానులపై అవి విపరీతమైన ప్రేమ కురిపించాయట.
శునకాల గుండె వేగంలో మార్పులు చోటు చేసుకున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ స్ప్రేకు శత్రువులను మిత్రులుగా చేసుకునే సామర్థ్యం లేనప్పటికీ, స్నేహ బంధాన్ని, కుటుంబ సంబంధాలను బలోపేతం చేసే లక్షణం మాత్రం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని మనుషులపై ప్రయోగించి, నిరూపించుకోవాల్సి ఉందని పరిశోధనలకు నేతృత్వం వహించిన మిహో నాగసావా తెలిపారు.