: సంచి నిండా డబ్బులు.. జేబు నిండా సరుకులు: బాబు వ్యంగ్యం
కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలతో సావాసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్యులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో తుని వద్ద పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో జేబులో డబ్బులు తీసుకుని మార్కెట్ కు వెళితే సంచి నిండా సరుకులు వచ్చేవని.. నేడు సంచి నిండా డబ్బులు తీసుకెళితేనే జేబు నిండా సరుకులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా డీజిల్ ధరలు, వంటగ్యాస్ ధరలు పెంచడంతో ఎవరూ ఆనందంగా లేని పరిస్థితి ఉత్పన్నమైందని బాబు అన్నారు. తాము 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఏనాడూ గ్యాస్ ధర పెంచలేదని చెప్పారు. ప్రస్తుత సర్కారు కొత్త గ్యాస్ కనెక్షన్ కు ఆరు, ఏడు వేలు వసూలు చేస్తూ సిలిండర్ ధరను అమాంతం పెంచేశారని బాబు ఆరోపించారు. ఇక సెల్ ఫోన్లు సైతం టీడీపీ హయాంలోనే వచ్చాయని బాబు అన్నారు.