: స్విస్ బ్యాంకులో భారతీయుల ధనం పెరిగింది... ఇతర దేశీయుల ధనం కరిగింది!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం నెలకొన్నా... భారతీయుల నల్లధనం మాత్రం పాపం పెరిగినట్టు పెరిగిపోతోంది. గతేడాది ఈ నల్లధనం 14 వేల కోట్ల రూపాయల మేర పెరిగినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ ఓ నివేదిక విడుదల చేసింది. గతేడాది 40 శాతం వృద్ధితో 1.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్ లు పెరిగినట్టు నివేదికలో పేర్కొంది. అదే సమయంలో స్విస్ బ్యాంకుల్లో ఇతర దేశస్తుల నగదు రికార్డు స్థాయిలో తరిగిపోయిందని నివేదిక వెల్లడించింది. 2013 సంవత్సరానికి తగ్గిన విదేశీ కస్టమర్ల నగదు నిల్వల విలువ 90 లక్షల కోట్ల రూపాయలు (1.56 ట్రిలియన్ డాలర్లు) అని ఆ నివేదిక తెలిపింది.
స్విస్ బ్యాంక్ చరిత్రలో ఇదే కనిష్ఠమని నివేదిక పేర్కొంది. భారత్ తో పాటు ఇతరదేశాలు నల్లధనం వివరాలు వెల్లడించాలని ఒత్తిడి పెంచుతుండడంతో స్విస్ నేషనల్ బ్యాంక్ తాజా గణాంకాలను విడుదల చేసింది. స్విస్ బ్యాంకుల్లో వ్యక్తులు, సంస్థలు, ఇతరులు దాచుకున్న సొమ్ము మొత్తం 1.95 బిలియన్ ఫ్రాంకులు కాగా... వెల్త్ మేనేజర్స్, ఫండ్స్, అధికారిక బినామీలు దాచిన సొమ్ము 77.3 మిలియన్ ఫ్రాంకులని స్విస్ నేషనల్ బ్యాంకు వెల్లడించింది.