: 62 ఏళ్ల ఆంధ్రా అసెంబ్లీలో తొలిసారి ఆవిష్కృతమైన దృశ్యం
62 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా ఓ విచిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 1952లో మద్రాసు స్టేట్ నుంచి తెలుగు వారిని వేరు చేస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత హైదరాబాదు స్టేట్ ఆంధ్రలో కలవడంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటి నుంచి 31 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం వహించింది.
1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడ్డా, తిరిగి పుంజుకుని ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించింది. తరువాత తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుని సత్తా చాటింది. ఆ తరువాత ఎన్ని పార్టీలు పురుడు పోసుకున్నా... పురిట్లోనే ప్రాణం పోయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి దాసోహమవడమో...లేక పరాజయ భారంతో తోకముడవడమో జరిగింది. మళ్లీ 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది.
రాష్ట్రం ముక్కలైన తరువాత ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పుకు తొలి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కకుండా పోయింది. గత 62 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో నామరూపాల్లేకుండా పోయింది. గతంలో నెత్తిన పెట్టుకున్న ప్రజలు...కాంగ్రెస్ పార్టీని ఛీ కొట్టి ఉప్పుపాతరేశారు. దీంతో అసెంబ్లీలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ లేకుండా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిజంగానే ఇదొక వైచిత్రి!