: సుప్రీం అనుమతిస్తే... మ్యూజియంలో పెడతాం: కేరళ సీఎం
సుప్రీంకోర్టు అనుమతిస్తే, తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో కనుగొన్న నిధినిక్షేపాలను మ్యూజియంలో ప్రదర్శించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేవుడికీ లేనన్ని నగలు, నిధులు పద్మనాభస్వామి సొంతమని పేర్కొన్నారు. ఈ నిధులను చిత్తశుద్ధిగా కాపాడడం ట్రావెన్ కోర్ మాజీ రాజకుటుంబం నిజాయతీకి నిదర్శనమని ఆయన కొనియాడారు.
ఈ కేసు ఆగస్టు 6న న్యాయస్థానం ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆలయ సంపదను రాజకుటుంబం అక్రమంగా తరలిస్తోందని వచ్చిన వార్తలను ఆయన కొట్టిపడేశారు. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసిన రాజకుటుంబాన్ని విమర్శించడం తగదని ఆయన హితవు పలికారు. రాజకుటుంబంపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రతినిధి సమర్పించిన నివేదిక ఇంకా తమకు చేరలేదని ఆయన వెల్లడించారు. అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో కనుగొన్న సంపదను సంప్రదాయం పేరిట ట్రావెన్ కోర్ రాజకుటుంబం తరలిస్తోందని గుడికి చెందిన అర్చకులే ఆరోపించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ప్రతినిధిని నియమించింది.