: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు


ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ మొదటి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం అయిదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనుండగా, ఈ రోజు ఉదయం 11:52 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. వెంటనే ప్రొటెం స్పీకర్ నారాయణస్వామి నాయుడు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడం ప్రారంభిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, సభా నాయకుడైన చంద్రబాబునాయుడు శాసనసభలో తొలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తర్వాత మంత్రులు, మహిళా సభ్యులు, ఆ తర్వాత అక్షర క్రమం ప్రకారం ఇతర సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ రోజు పూర్తి కాని పక్షంలో రేపు కూడా కొనసాగిస్తారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, పోలింగ్ కు ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భుమా శోభానాగిరెడ్డి సంతాప తీర్మానాలను ప్రవేశ పెడతారు.

ఇక రేపు ఉదయం 9.22 గంటలకు రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21వ తేదీ ఉదయం 8:55 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 23,24 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతారు. దానిపై చర్చ ఉంటుంది. ముందుగా ఈ రోజు ఉదయం 9:22 గంటలకు ప్రొటెం స్పీకర్ గా పతివాడ నారాయణస్వామి నాయుడు చేత రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు.

  • Loading...

More Telugu News