: పట్టణాలను నిర్మిస్తామంటూ బ్రిటన్ సంస్థ కలిసింది: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ తనను మర్యాద పూర్వకంగా కలిసిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కొత్త రాజధానిపై ఆ కమిటీ చేసిన అధ్యయనాన్ని వివరించిందని అన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే రాజధానికి రవాణా సౌకర్యం, మెట్రో రైలు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం ఉండాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా వారు సూచించిన అంశాలకు అదనంగా ఉండాల్సిన కొన్ని సౌకర్యాలను సూచించానని ఆయన వెల్లడించారు.
అలాగే పట్టణాలను నిర్మిస్తామంటూ బ్రిటన్ కు చెందిన కొన్ని సంస్థలు కలిశాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ఒక నగరానికి ఉండే దీర్ఘకాలిక అవసరాలు, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై పూర్తి అవగాహనతో ఆయా సంస్థలు తనను కలిశాయని ఆయన చెప్పారు. నగరాన్ని నిర్మించే విధానంపై పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ కావాలని సూచించానని ఆయన వెల్లడించారు. కొద్ది రోజుల్లో వారు తనను కలిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విషయమై సింగపూర్, మలేసియా కు చెందిన సంస్థలు కూడా గతంలో ఆయనను కలిసినట్టు సమాచారం.