: వజ్రోత్సవాలకు ముస్తాబైన ‘రెడ్డి కాలేజ్’
హైదరాబాదు నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి కళాశాల వజ్రోత్సవాలను జరుపుకోనుంది. తెలంగాణలో గ్రామీణ విద్యాభివృద్ధి కోసం ప్రారంభమైన రెడ్డి కళాశాల... వేలాది మంది మహిళలకు విద్యనందించిన ఘనతను సంపాదించుకుంది. ఇవాళ నారాయణగూడ కళాశాల సభామందిరంలో హైదరాబాద్ మహిళా విద్యాసంఘం గౌరవాధ్యక్షుడు జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉత్సవాల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల సభా మందిరానికి డైమండ్ జూబ్లీ ఆడిటోరియంగా నామకరణం చేశారు.
లోగో ఆవిష్కరణ అనంతరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... నిజాం కాలంలో మహిళలకు చదువుకునే అవకాశం లేకపోవడంతో వారు వెనుకబాటుతనానికి గురవుతున్నారని భావించిన ఆనాటి పెద్దలు హైదరాబాదు మహిళా విద్యా సంఘాన్ని ఏర్పాటు చేసి, సంస్థ ఆధ్వర్యంలో రెడ్డి మహిళా కళాశాలను ప్రారంభించారని అన్నారు. అలాగే ప్రాథమిక విద్య కోసం మాడపాటి హనుమంతరావు పాఠశాలను కూడా ప్రారంభించారని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి. లక్ష్మీదేవి, ఉపాధ్యక్షుడు సి.మల్లారెడ్డి, గౌరవ కార్యదర్శి ప్రొ. డిప్పారెడ్డి, డీన్ ప్రొఫెసర్ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.