: ఆ రోజు సైరన్ పనిచేయలేదు... యాజమాన్యానిదే బాధ్యత: మహేందర్ రెడ్డి
హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నది సంఘటన జరిగిన రోజు లార్జీ డ్యాం గేట్లు ఎత్తుతున్న సందర్భంగా సైరన్ పని చేయలేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జరిగిన ఘటనకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని అన్నారు. ఆ రోజు సైరన్ పని చేసి ఉన్నట్టైతే విద్యార్థులు ప్రమాదానికి గురై ఉండేవారు కాదని ఆయన తెలిపారు.
ఇంకా 17 మంది విద్యార్థుల ఆచూకీ లభించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. కన్న బిడ్డలకోసం గాలించిన విద్యార్థుల తల్లిదండ్రులంతా స్వస్థలాలకు తరలి వెళ్లారని ఆయన చెప్పారు. ఆచూకీ లభించని వారి తల్లిదండ్రులకు, మృతుల తల్లిదండ్రులకు ఉత్తరాఖండ్ బాధితుల మాదిరిగా డెత్ సర్టిఫికేట్లు జారీ చేశామని ఆయన వివరించారు. ఎన్ డీఆర్ఎస్ సిబ్బందితో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.