: హద్దు మీరితే ప్రమాదమే...జానారెడ్డి హెచ్చరిక


టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెళ్లను నిలిపి వేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది ప్రసారం చేయకూడదని మీడియాకు హితవు పలికారు. పత్రికలు, మీడియాకు ఆవేశం ఉండకూడదని, ధర్మావేశం ఉండాలని ఆయన సూచించారు. అలాగే అధికారం చేతిలో ఉంది కదా అని అధికార దుర్వినియోగం చేయకూడదని జానారెడ్డి సూచించారు.

ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది ప్రసారం చేయకూడదని, హద్దులు ఉంటాయని ఆయన సూచించారు. మీడియాను రాజకీయం అదుపు చేయాలనుకోవడం, రాజకీయ నేతలను మీడియా అదుపుచేయాలనుకోవడం సరికాదని ఆయన తెలిపారు. టీవీ 9 ప్రసారం చేసిన బుల్లెట్ న్యూస్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, ఆయన చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని జానారెడ్డి చెప్పారు.

ఆయన జడ్జిమెంటు విడుదల చేయడానికి ముందే ఎంఎస్ వోలు టీవీ 9, ఏబీఎన్ ఛానెల్స్ ని నిలుపుచేయడం ప్రతీకార చర్యలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంగా తాము కక్ష సాధింపు చర్యలను సమర్ధించమని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా టీవీ 9, ఏబీఎన్ ప్రసారాలను నిలుపు చేయడం సరికాదని జానారెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News