: ఆ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలివ్వండి: కేజ్రీవాల్
హత్యకు గురైన కానిస్టేబుల్ మన్నారామ్ కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవిద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిశారు. ఈ సందర్భంగా గతంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను వాటర్ మాఫియా హత్య చేసిన ఘటనలో ఆప్ ప్రభుత్వం కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు.
దక్షిణ ఢిల్లీలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్, అనుమతి లేని ప్రదేశంలో ప్రవేశిస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా, వాహనదారుడు కానిస్టేబుల్ పై కారు ఎక్కించి హత్య చేశాడు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఇది చాలదనీ, కోటి రూపాయలు ఇవ్వాలనీ కేజ్రీ డిమాండ్ చేస్తున్నారు.