: బహ్రెయిన్ లో చిత్రహింసల నుంచి మహిళకు విముక్తి కల్పించిన కలెక్టర్
సంపాదన ఆశతో దేశం కాని దేశంలో చిత్రహింసలు అనుభవిస్తున్న మహిళకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ విముక్తి కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన జల్లిపల్లె ధర్మారావు, సత్యవతి దంపతుల కుమార్తె నాగేశ్వరిని జంగారెడ్డిగూడెంకు చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. అతను మద్యానికి బానిసై నాగేశ్వరిని పట్టించుకోకపోవడంతో ఐదేళ్ల క్రితం ఆమె పుట్టింటికి చేరుకుంది. విదేశాల్లో సంపాదనావకాశాలు ఎక్కువని అమ్మలక్కల మాటలు విన్న నాగేశ్వరి ఏజెంట్లను సంప్రదించింది. దీంతో వారు ఆమెలో లేనిపోని ఆశలు కల్పించి బహ్రెయిన్ పంపించారు.
అక్కడ మూడు నాలుగు ఇళ్లలో పని చేసింది. అన్ని చోట్లా ఆమె చిత్రహింసలు అనుభవించింది. రెండు నెలల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నాగేశ్వరి, తాను అనుభవిస్తున్న బాధల గురించి వివరించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను రక్షించి తీసుకురావాలని గణపవరం పోలీసులను ఆశ్రయించారు. 50 రోజుల పాటు వారి చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోకపోవడంతో, 10 రోజుల క్రిందట వారు కలెక్టర్ సిద్ధార్ద్ జైన్ ను ఆశ్రయించారు. తక్షణం స్పందించిన కలెక్టర్ ఆమెను తీసుకొచ్చే భాధ్యతను జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణికి అప్పగించారు.
ఆమె నాగేశ్వరిని బహ్రెయిన్ పంపిన ఏజెంట్లను ఏలూరు పిలిపించి మాట్లాడారు. తక్షణం ఆమెను జిల్లాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో వారు బహ్రెయిన్ లోని ఏజెంట్లను సంప్రదించి ఆమెను రప్పించారు. ముంబై వరకు వచ్చిన ఆమె టికెట్ కు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన ప్రారంభించింది. దాంతో కొందరు వ్యక్తులు ఆమెను హైదరాబాద్ పంపించారు. అక్కడి నుంచి ఆమె ఏలూరు చేరుకున్నారు. దీంతో ఆమె, ఆమె తల్లిదండ్రులు కలెక్టర్ కి, బాలల సంరక్షణాధికారికి కృతజ్ఞతలు తెలిపారు.