: ఆమె తీసుకున్న సెల్ఫీ...వైద్యుల పని సులభం చేసింది


సెల్ఫీ అంటే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సందర్భం ఎదురైతే చాలు, సెల్ఫీతీసి నెటిజన్లను అలరిస్తుంటారు. అదే యువత అయితే, సెల్ లో మంచి కెమెరా ఉందంటే చాలు సెల్ఫీ (తమను తామే ఫోటో) తీసుకోవడం, వాటిని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం, లేదా వాట్సప్ లో ఫ్రెండ్స్ కు పంపి అభినందనలు, లైక్ లు అందుకోవడం సరదా. ఇలా సరదాగా తీసుకున్న సెల్ఫీని ఓ మహిళ క్రియేటివ్ గా ఉపయోగించుకోవడంతో ఆమెకు మంచి వైద్యం అందింది.

కెనడాలోని టొరంటోకు చెందిన స్టాసీ యెపెస్ (49) అనే మహిళ ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆమెకు ఎడమవైపు చేతులు, కాళ్లు లాగేస్తున్నట్టు అనిపించింది. విషయం పక్కవాళ్లకు చెబుదామంటే మాట కూడా ముద్దగా వస్తోంది. ఏం చేయాలో అర్ధం కావట్లేదు. అంతే తన ఫోన్ తీసుకుని తన అవస్థను సెల్ఫీ వీడియో తీసుకోవడం మొదలు పెట్టింది. ఎలాగోలా టోరంటోలోని డౌన్ టౌన్ లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులకు ఫోన్ ఇచ్చి, అందులో వీడియో చూడమని చెప్పింది.

దీంతో ఆమెకు ట్రాన్సియెంట్ ఇపెమిక్ ఎటాక్స్ వచ్చినట్టు వైద్యులు గుర్తించి, తక్షణం టొరంటోలోని వెస్ట్రన్ ఆసుపత్రిలోని స్ట్రోక్స్ యూనిట్ కు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె చెప్పిన విషయాలన్నీ సరైనవేనని నిర్థారించారు. ఇప్పటి వరకు ఇలాంటి రోగి తమ వద్దకు రాలేదని, రోగ లక్షణాలు చెప్పేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదని న్యూరాలజిస్టు షెరిల్ జైగోబిన్ తెలిపారు.

  • Loading...

More Telugu News