: కేజ్రీవాల్ ప్రధాని కావాలని ఆశపడ్డారు: అన్నా హజారే
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలని ఆశపడ్డారని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే తెలిపారు. రాలేగావ్ సిద్ధిలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమ పంధా వీడొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం కేజ్రీవాల్ చేసిన పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఓ సందర్భంలో కలిసినప్పుడు, ఢిల్లీకి పరిమితం కావాలని సలహా ఇచ్చానని అన్నా తెలిపారు.
జాతీయ స్థాయి రాజకీయాల గురించి అప్పుడే ఆలోచించవద్దని సూచించానని, అయితే కేజ్రీవాల్ తన సూచనను పెడచెవిన పెట్టారని ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటెత్తు పోకడలు మానకుంటే పార్టీ మనుగడకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.