: విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయరేం?: రైతులు
వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ విజయనగరం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్.కోట మండలం బొడ్డవరం విద్యుత్ సబ్ స్టేషన్ ను ఇవాళ ఉదయం నాలుగు గ్రామాలకు చెందిన రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి ఏడుగంటలు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ, గత నెలరోజులుగా కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ వారు కన్నెర్ర చేశారు. ఆందోళనలో భాగంగా సబ్ స్టేషన్ సమీపంలోని రోడ్డుపై వారు భైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి విద్యుత్ శాఖ ఏడీ, రైతులతో చర్చలు జరిపారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తామంటూ ఏడీ రామకృష్ణ లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.