: అడ్డుకున్నాడని...కానిస్టేబుల్ ను కర్కశంగా చంపేశారు
న్యాయంగా విధులు నిర్వర్తిద్దామని ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ ఢిల్లీలోని జకీరా ఫ్లై ఓవర్ దగ్గర నోఎంట్రీ జోన్ లోకి ఓ కారు ప్రవేశించింది. దానిని కానిస్టేబుల్ మానా రామ్ అడ్డుకున్నాడు. అయినప్పటికీ కారు ఆపకపోవడంతో, మానా రామ్ కారు బోనెట్ పైకి అమాంతం దూకాడు. దీంతో కారు డ్రైవర్ రమణ్ కాంత్ సినిమా తరహాలో కారును అటూఇటూ తిప్పుతూ 150 మీటర్ల దూరం దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా, కింద పడిపోయిన మానా రామ్ మీదినుంచి కారును పోనిచ్చాడు. దీంతో మానా రామ్ మృతిచెందాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారుతో సహా పారిపోయిన డ్రైవర్ రమణ్ కాంత్ ను అరెస్టు చేశారు. మానా రామ్ కు భార్య, చెల్లెలు, రెండున్నరేళ్ల బిడ్డ ఉన్నారు. 2009 నుంచి ఢిల్లీ రోడ్లపై మరణించిన ట్రాఫిక్ పోలీసుల్లో మానా రామ్ తొమ్మిదో వాడని పోలీసులు వెల్లడించారు.