: భార్యతో గొడవ పడిన భర్త... కోపంతో కూతురుని చంపేశాడు
భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగింది. కోపంతో విచక్షణను కోల్పోయిన భర్త ఐదేళ్ల చిన్నారి ఉసురు తీశాడు. ఈ ఘటనలో అతని భార్య, మరదలు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. 37 ఏళ్ల సుబోధ్ సాహు అనే వ్యక్తి కన్నకూతురైన సిమ్రాన్ ను నరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా అతడు తన భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత అతడు విషం తాగి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించాడు. ఇదంతా గమనించిన ఇరుగుపొరుగువారు అతడిని రక్షించినట్లు పోలీస్ అధికారి రష్మీ రంజన్ సాహు మీడియాకు తెలిపారు.
సుబోధ్ కియోంఝర్ జిల్లాలో పనిచేస్తుండగా, మిగిలిన కుటుంబం మొత్తం భువనేశ్వర్ లోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. అయితే, వేరుకాపురం పెట్టాలంటూ అతని భార్య ఎప్పటి నుంచో పోరు పెడుతోంది. ఇదే విషయంపై వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసినట్లు తెలిసింది. విడిగా ఉంటే ఖర్చులు పెరిగిపోతాయని సుబోధ్ భార్యతో వాదించాడు. చివరకు ఆ వివాదమే ఈ దారుణానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడిన వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.