: టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల మృతికి చంద్రబాబు, హరికృష్ణ, సుజనా చౌదరి సంతాపం
కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేత హరికృష్ణ, ఎంపీ సుజనాచౌదరి తమ సంతాపం తెలిపారు. తంగిరాల భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు కాసేపట్లో చంద్రబాబు నందిగామ బయలుదేరనున్నారు.
ప్రభాకరరావు భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం స్థానిక కేవీఆర్ కళాశాల ఆవరణలో ఉంచారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. నిజాయతీపరుడు, వివాదరహితుడిగా పేరున్న ఆయన తనకు అత్యంత సన్నిహితుడని, తంగిరాలను కోల్పోవడం బాధాకరమని, ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసిందని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.