: ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేస్తాం: రాజయ్య
టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా వరంగల్ జిల్లా జనగామకు వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా జనగామ చౌరస్తాలో జరిగిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ... ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సాగు, తాగునీటిపై అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టంగా తెలిపారని అన్నారు. వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, యాదగిరిరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.