: మరో రెండు రోజులు వడగాలులు వీస్తాయ్
మరో రెండు రోజుల పాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 48 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు. తీవ్ర వడగాలులు, ఎండలు, ఉక్కపోత వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.