: పెట్రోల్ బంక్ ను ఢీకొన్న కారు... డ్రైవర్ ను రక్షించి, హీరోగా మారిన పోలీస్!
పెట్రోల్ బంక్ ను కారు ఢీ కొంది. అంతే, మంటలు ఎగసిపడ్డాయి. ప్రాణ భయంతో పరుగందుకున్న పోలీస్, ప్రమాదంలో చిక్కుకున్న వాడిని రక్షించి హీరోగా మారాడు. అమెరికాలోని న్యూయార్క్ లో ఓ 68 ఏళ్ల వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా స్పృహ కోల్పోయాడు. దీంతో అదుపుతప్పిన కారు, దగ్గర్లో ఉన్న పెట్రోలు బంక్ లోని పంప్ ను ఢీ కొట్టింది. వెంటనే మంటలు ఎగసిపడ్డాయి. అదే పెట్రోలు బంక్ లో తన కారుకు పెట్రోలు పోసుకుంటున్న జాన్ వెస్కియో అనే పోలీస్ అధికారి మంటల్ని చూసి పరిగెత్తడం ప్రారంభించాడు.
పరిగెడుతూ మంటల్ని చూసేందుకు వెనక్కి తిరిగాడు. అక్కడ పెట్రోలు పంపును ఢీ కొన్న కారులో ఓ వ్యక్తి పడి ఉండడం చూశాడు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా వెనుకకు పరిగెత్తి, కారులో పడి ఉన్న వ్యక్తిని అమాంతం లాక్కొచ్చి మంటల బారినుంచి కాపాడి ఆసుపత్రికి తరలించాడు. దీంతో ఆ పోలీస్ అధికారి అమెరికాలో ఇప్పుడు హీరోగా మారిపోయాడు. ఈ సన్నివేశం మొత్తం పెట్రోలు బంకులోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీనిని టీవీ ఛానల్స్ ప్రసారం చేయడంతో విషయం వెలుగు చూసింది.