: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. స్థంభించిన రవాణా వ్యవస్థ
విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంట్ కోతలు నిరసిస్తూ వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పాక్షికంగా స్థంభించింది. ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద సీపీఎం, సీపీఐ నేతలు ధర్నా చేపట్టారు. బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యదర్శులు రాఘవులు, నారాయణ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటు నగరంలోని హయత్ నగర్, ఉప్పల్, ముషీరాబాద్ డిపోల ముందు విపక్షాలు, టీడీపీ, బీజేపీ నేతలు బైఠాయించారు. అటు విజయవాడ, నెల్లూరులో పలువురు నేతలు బంద్ నిర్వహిస్తున్నారు. బస్ స్టేషన్ లో బస్సులు బయటికి కదలకుండా సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించాలని డిమాండు చేశారు. మరోవైపు బంద్ నేపథ్యంలో కడప జిల్లాలోని 8 డిపోల పరిధిలో 920 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
కర్నూలు జిల్లాలో రాష్ట్రవ్యాప్త బంద్ ప్రభావం బాగా కనిపిస్తోంది. జిల్లాలోని 11 డిపోల్లో 980 బస్సులు నిలిచిపోయాయి. టీడీపీ, బీజేపీల కార్యకర్తలు దుకాణాలు మూసివేయించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 11 డిపోల పరిధిలో 1300 బస్సులు నిలిచిపోయాయి. అనంతపురం బస్టాండ్ వద్ద ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పార్ధసారధి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, పెద్దాపురం ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు ముందస్తుగానే నిలిపివేశారు.
కరీంగనర్, శ్రీకాకుళం, వరంగల్, చిత్తూరులో విద్యుత్ సమస్యలపై బంద్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. నిరసన వ్యక్తం చేస్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కొంతమంది స్వచ్ఛంధంగా విద్యా, వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ కు మద్దతు తెలుపుతున్నారు. కొన్ని దుకాణాలను పార్టీ నేతలే బలవంతంగా మూసివేయిస్తున్నారు. బంద్ ఎలా కొనసాగుతున్నా ఈ ప్రభావం మాత్రం ప్రయాణికులపై పడింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.