: రొజ్జొ పండుగ వేడుకల్లో సందడి చేసిన ఒడిశా యువతులు
ఒడిశాలో రొజ్జొ వేడుకలు ప్రారంభమయ్యాయి. రొజ్జొ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. యువతులకే ప్రత్యేకమైన ఈ వేడుకలు ఋతుపవనాల ఆగమనాన్ని స్వాగతిస్తూ మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ రోజు నుంచి ఈ పండగ సందడి మొదలయింది. దీన్నే రొజ్జొ, సొజ్జొగా పాటిస్తారు. పెళ్లి కాని ఆడపిల్లలు నూతన వస్త్రాల కొనుగోలు, ఇళ్లు, తోటల్లో ఉయ్యాలలు కట్టి ముస్తాబు కావటం వంటి అంశాల్లో నిమిగ్నమవుతారు. చేతికి గోరింటాకు, కాళ్లకు పారాణితో ఆడపిల్లలు అందంగా ముస్తాబవుతారు. బీద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తమ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు.
శుక్రవారం నాడు భువనేశ్వర్ లో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రొజ్జొ వేడుకలు జరిగాయి. ఒరిస్సా పర్యాటక శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ వంటకాలు, రొజ్జొ పాన్ ల ప్రదర్శన ఏర్పాటైంది. వివిధ కళాశాలల విద్యార్థులు ఉయ్యాలలు ఊగుతూ, పిండి వంటలను రుచి చూస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అశోక్ పండా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పురాతన సంప్రదాయం, వంటలపై నేటితరానికి అవగాహన కల్పించేందుకు ఈ వేడుకలను నిర్వహించామని అన్నారు.