: నా రాజకీయ జీవితం విశాఖలోనే ప్రారంభమైంది: వెంకయ్యనాయుడు
తన రాజకీయ జీవితం విశాఖలోనే ప్రారంభమైందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తొలిసారి విశాఖ విచ్చేసిన సందర్భంగా బీజేపీ, టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ, విశాఖకు వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని అన్నారు. జీవితంలో మరువలేని నగరం విశాఖ అని ఆయన తెలిపారు. దేశంలోని అగ్రగామి నగరాల్లో విశాఖ ఒకటని ఆయన చెప్పారు. దేశం, రాష్ట్రం కలసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పదేళ్ల యూపీఏ పాలనలో దేశంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. సమస్యలకు పరిష్కారం, సుపరిపాలన, అభివృద్ధి సాధనే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలు ప్రభుత్వం తమకోసం ఏం చేస్తుందా? అని ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. పట్టం కట్టిన ప్రజల సంక్షేమానికి కృషి చేసే వారినే ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. విశాఖకు మేలు చేస్తాడనే హరిబాబును విశాఖ ప్రజలు ఎన్నుకున్నారని ఆయన చెప్పారు.