: ఎండ వాత...కరెంటు కోత...నరకం అనుభవిస్తున్న జనం!


బయటకి వెళ్తే ఎండ వాత పెడుతోంది. ఇంట్లో ఉందామంటే కరెంటు కోత నరకం చూపిస్తోంది. ఏం చేయాలో అర్థం కాక జనం తల్లడిల్లిపోతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భగ్గుమంటున్న భానుడి ధాటికి తాళలేక 24 మంది మృత్యువాత పడ్డారు. అనధికార విద్యుత్ కోతలు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి.

పట్టణాల్లో 8 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 18 గంటలు మండల కేంద్రాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు వడగాడ్పులు జత కలియడంతో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. గత రెండు రోజులుగా పెరిగిన ఎండ వేడిమి కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మత్స్య పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఎండవేడిమికి చేపలు చనిపోతుండడంతో, కేజీ 5 రూపాయల లెక్కన అమ్మినా ఎవరూ వాటిని కొనడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్నా ఎండలు మండిపోతుండడంపై పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వారు అభిప్రాయపడుతున్నారు. భానుడు శాంతిస్తే కానీ జనాలు మనలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.

  • Loading...

More Telugu News